Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 68

Janaka sends invitation to Dasaratha

||om tat sat ||

జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాంతవాహనాః |
త్రిరాత్రముషితా మార్గే తే అయోధ్యాయాం ప్రావిశన్ పురీమ్ ||

తా|| జనకుని చేత ఆదేశించబడిన ఆ దూతలు మార్గములో మూడురాత్రులు అగి అలసటపొందిన వాహనములు కలవారై అయోధ్యానగరము ప్రవేశించితిరి

బాలకాండ
అష్టషష్టితమస్సర్గః
(దశరథునికి జనకుని ఆహ్వానము)

జనకుని చేత ఆదేశించబడిన ఆదూతలు మూడు రోజులు అయోధ్యా మార్గములో పోయి రాత్రులు మాత్రమే విశ్రమించి అలసటపొందిన వాహనములు కలవారై అయోధ్యానగరము ప్రవేశించితిరి. ఆ దశరథ మహరాజు యొక్క భవనమును సమీపించి ఇట్లు పలికిరి. "మహారాజునకు శీఘ్రముగా నివేదింపుడు జనకుని దూతలు వచ్చినారు" అని. అలా చెప్పబడిన ద్వారపాలకులు రఘుకులవంశజునకు ఆ విషయము నివేదించిరి.

రాజుగారి అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించి దేవతలతో సమానుడైన వృద్ధుడైన దశరథ మహారాజు ని చూచితిరి. దూతలు ప్రశాంత మనస్సుతో అందరికి అంజలి ఘటించి రాజుతో నియమపూర్వకముగా మధురమైన మాటలతో ఇట్లు పలికిరి. "మిథిలాధిపతి అగు జనకుడు అగ్నిహోత్ర నిరతుడగు ఉపాధ్యాయ పురోహితులతో కూడిన దశరథ మహారాజు గారి కుశలము అడుగుచున్నారు. ఓ మహారాజా !మధురముగా స్నేహపూర్వకముగా జనకుడు మరల మరల మీ క్షేమము అడుగుచున్నారు. మిథిలాధిపతి అగు జనకుడు మీ కుశలములు అడిగి కౌశికుని అనుమతితో ఈ మాటలు మీకు చెప్పుచున్నారు. ’ఫూర్వము మా కుమార్తె వీర్య శుల్కమని ప్రతిజ్ఞచేసినది విదితమే అగును. అనేకమంది రాజులు విఫలురై తిరుగుపొయినది మీకు విదితమే. ఓ రాజన్ ! భాగ్యవశమున విశ్వామిత్రునితో కలిసి వచ్చిన వీరులు నీ పుత్రులు నా కుమార్తెను గెలుచుకున్నారు. ఓ రాజన్ ! మహత్తరమైన జనసంపది లో ఆ దివ్యమైన ధనస్సు మహాత్ముడగు రామునిచే భగ్నము చేయబడెను. అందువలన వీర్యశుల్కమైన సీతను ఇచ్చెదను అన్న ప్రతిజ్ఞ పాటింప దలిచితిని . దానికి మీ అనుమతికి ప్రార్థించుచున్నాను. మీకు శుభమగుగాక . ఓ మహరాజా ! మీ ఉపాధ్యాయులు పురోహితులతో సహ శీఘ్రముగా రండు. రామ లక్ష్మణులను కూడా చూడవచ్చు. ఓ రాజేంద్ర ! మా కోరికను మన్నించతగును. ఇద్దరు పుత్రుల ఆనందములో కూడా నీవు పాల్గొనవచ్చు’ . ఈ విధముగా విశ్వామిత్రుని అనుమతి తో శతానందుని సూచనను అనుసరించి జనకుడు ఇట్లు మథురమగు వాక్యములను పలికెను".

ఆ విథముగా దూత వాక్యములను విని రాజు పరమ ఆనంద పడెను. అతడు వసిష్టుడు వామదేవుడు ఇతర మంత్రులతో ఇట్లు పలికెను.
"కౌసల్య తనయుడు , తమ్ముడగు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని రక్షణలో వున్నారు. విదేహ రాజ్యములో ఉన్నారు. కాకుత్‍స్థుల వీర్యము చూసి మహాత్ముడగు జనకుడు తన కుమార్తెను రాఘవునకు ఇచ్చుటకు కోరుచున్నాడు. జనకుని వృత్తాంతము మీకు సమ్మతమైనచో ఆ మహాత్ముని నగరము వెళ్ళుదము. కాలము వృథా చేయవలదు".

అందరు మహర్షులు , మంత్రులు తో కలిసి "బాగు బాగు" అని పలికిరి. సంతోషముతో దశరథుడు మంత్రులతో మరుదినమే ప్రయాణమని చెప్పెను. ఆ నరేంద్రుని మంత్రులు సకల గుణ సమన్వితులు , రాజుచే మెప్పుపొందినవారు . వారు సంతోషముతో ఆ రాత్రి గడిపిరి.

ఈవిధముగా బాలాకాండలోని అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||

మంత్రిణస్తాం నరేంద్రస్య రాత్రిం పరమ సత్కృతాః |
ఊషుస్తే ముదితాస్సర్వే గుణైస్సర్వై స్సమన్వితాః ||

"ఆ నరేంద్రుని మంత్రులు సకల గుణ సమన్వితులు , రాజుచే మెప్పుపొందినవారు . వారు సంతోషముతో రాత్రి గడిపిరి".

||om tat sat ||